కావాల్సిన పదార్థాలు:
దొండకాయలు – పావుకిలో, ఆవపిండి – 100గ్రాములు, కారం – 100గ్రాములు, ఉప్పు – 100గ్రాములు, నువ్వలనూనె – పావుకిలో, పసుపు – అర టీ స్పూను, ఇంగువ – చిటికెడు, మెంతిపిండి – ఒక టీ స్పూను, చింతపండు – 50గ్రాములు లేదా నిమ్మకాయలు(పెద్దవి) – రెండు.
తయారుచేయు విధానం:
ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఆరిన తరువాత కాయలకి చిన్న పుల్లతో గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నూనెపోసి అందులో ఈ దొండకాయల్ని వేసి స్టౌమీద పెట్టాలి. ఈ గిన్నెపై మరో వెడల్పాటి గిన్నెపెట్టి అందులో నీళ్లుపోయాలి. ఇప్పుడు దీన్ని చిన్నమంటపై మగ్గనివ్వాలి. కాయలు మెత్తపడ్డాక దించేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి. ఉడికిన దొండకాయలపై నిమ్మరసం వేసి బాగా కలిపి ఆవపిండిలో వేసి కలుపుకోవాలి. మిగిలిన నూనెని వేడిచేసి అందులో ఇంగువ వేసి దొండకాయలపై పోయాలి. ఆవపిండి కాయలకు పట్టేలా బాగా కలుపుకుని ఒక గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. మూడవ రోజున తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ దొండకాయల ఆవకాయ నెలరోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.