కృష్ణా : పాస్టర్ను మోసగించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కైకలూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చంటిబాబు(29), తులసీరాం(29), సత్యనారాయణ(45) ముగ్గురు స్నేహితులు. తరుచుగా మోసాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో భాగంగానే బంగారం పేరుతో కైకలూరు మండలం వేమవరప్పాడు గ్రామానికి చెందిన పాస్టర్ జ్ఞాన విజయ్ను వీరు మోసగించారు. ఈ నెల 22వ తేదీన బంగారాన్ని అమ్ముతామంటూ పాస్టర్ను ఆశ్రయించారు. మాటామంతి ముగిసిన అనంతరం పాస్టర్ నుంచి రూ. 3 లక్షలు తీసుకుని బంగారం ఉన్న బ్యాగును పాస్టర్కు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బ్యాగు తెరిచి చూడగా కంగుతినడం పాస్టర్ వంతు అయింది. బ్యాగులో బంగారం బదులు రాయి ఉంది. దీంతో తాను మోసపోయాయని గ్రహించి వెంటనే కైకలూరు పోలీసులను ఆశ్రయించి పాస్టర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను నేడు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ. 4.5 లక్షల నగదు, నాలుగు మోటార్ బైక్లు, నాలుగు ఫోన్లు, 52 నకిలీ బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు.
