Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / తుంగభద్ర జలాలను మరింతగా వినియోగించుకునేందుకు

తుంగభద్ర జలాలను మరింతగా వినియోగించుకునేందుకు

రాజోలిబండ పథకానికి ప్రభుత్వం సిద్ధం
ప్రతిపాదనలను పంపిన జల వనరులశాఖ
త్వరలో పాలనామోదం
ప్రాజెక్టు అంచనా: రూ.1522 కోట్లు
సామర్థ్యం: 4 టీఎంసీలు
జలాశయాలు: 4
లక్ష్యం: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి తాగునీరు
కొత్త ఆయకట్టు అంచనా: 40వేల ఎకరాలు

అమరావతి: కర్నూలు జిల్లాకు తాగు, సాగునీరు అందించే రాజోలిబండ కాలువ మళ్లింపు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. తుంగభద్ర జలాలను మరింతగా వినియోగించుకునేందుకు వీలుగా కర్నూలు జిల్లా కోస్గి మండలం భాత్రబొమ్మలాపురం నుంచి కుడివైపు కాలువ మళ్లింపు పథకం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కర్నూలు జిల్లా జల వనరులశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఈ పథకంవల్ల కర్నూలు పశ్చిమ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడంతోపాటు కొత్త ఆయకట్టుకు నీరందించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఖర్చు ఎక్కువ… ప్రయోజనం తక్కువని గతంలో ఆర్థికశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఆ మేరకు కొన్ని సవరణలూ చేయడం పూర్తయింది. త్వరగా పాలనామోదం ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నిర్మాణం ఇలా..
* తుంగభద్రవద్ద భాత్రబొమ్మలాపురంవైపు ఉన్న ఆనకట్ట కుడివైపు నుంచి కర్నూలు జిల్లాలో ఒక కాలువను తవ్వుతారు.
* ఆ తర్వాత 5 విభాగాలుగా పంపిణీ కాలువలను తవ్వుతారు.
* 4 చోట్ల నీటిని ఎత్తిపోయడంతో పాటు 4 జలాశయాలు నిర్మిస్తారు.

భూసేకరణకు రూ.262 కోట్లు
ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలు, జలాశయాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకే రూ.262 కోట్లు అవసరమవుతుందని అంచనా.
* ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల కోసం కావాల్సిన భూమి: 4,030 ఎకరాలు
* జలాశయాలకు అవసరమైన భూమి: 2,290 ఎకరాలు
* ప్రధాన కాలువల మట్టి తవ్వకం వ్యయం: రూ.150 కోట్లు
* ఎత్తిపోతల పథకాల వ్యయం: రూ.425 కోట్లు

పనిచేసేదిలా…

1. తొలి రీచ్‌లో సున్నా నుంచి 5.540 కిలోమీటర్ల వరకు కాలువ తవ్వి 22 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తారు.
* ఒక ఎత్తిపోతల ఏర్పాటు చేసి అక్కడి నుంచి 60 రోజులు నీటిని ఎత్తి పోస్తారు.
* కోస్గివద్ద జలాశయం నిర్మిస్తారు. ఇందులో అర టీఎంసీ నీటిని నిల్వ చేస్తారు.

2. కోస్గి జలాశయం నుంచి 30.429 కిలోమీటర్ల వరకు కాలువ తవ్వుతారు.
* అక్కడ ఎత్తిపోతల నిర్మిస్తారు. 60 రోజుల్లో రోజుకు 1.81 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తారు.
* ఈ నీటిని పెద్దకడబూరు వద్ద జలాశయం నిర్మించి అందులోకి మళ్లిస్తారు. అర టీఎంసీ నీటిని ఇక్కడ నిల్వ చేస్తారు.

3. 30.4వ కిలోమీటరు నుంచి 55.410 కిలోమీటరు వరకు కాలువ తవ్వి నీటిని తీసుకెళ్తారు.
* అక్కడ ఎత్తిపోతల ఏర్పాటు చేసి ఎమ్మిగనూరు మండలం కొటెకలవద్ద 1.50 టీఎంసీల నీటి నిల్వతో జలాశయం నిర్మిస్తారు.

4. 55.410వ కిలోమీటరు నుంచి 86.150 కిలోమీటరు వరకు కాలువ తవ్వి అక్కడ మరో ఎత్తిపోతల నిర్మిస్తారు.
* ఆ నీటిని గోనెగండ్ల మండలం చిన్నమర్రివేడువద్ద 0.25 టీఎంసీల నీటి నిల్వతో నిర్మించే జలాశయంలోకి మళ్లిస్తారు.
* 86.150వ కిలోమీటరు నుంచి 160వ కిలోమీటరు వరకు ఈ నీటిని తీసుకువెళ్తారు.

Check Also

చంద్రబాబును కలిశాక క్లారిటీ ఇచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Share this on WhatsAppఅమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు  మాజీ ఎమ్మెల్యే వరుపుల రాజా భేటీ అయ్యారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *