Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేడే ‘సచివాలయా’ల పండగ!

నేడే ‘సచివాలయా’ల పండగ!

‘తూర్పు’లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
గ్రామాల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్లు.. విస్తృత ఏర్పాట్లు

అమరావతి: రాష్ట్ర స్థానిక పరిపాలనా వ్యవస్థలో నవశకం.. గ్రామ సచివాలయాల వ్యవస్థ. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన దీనిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా, ఇవన్నీ వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. ఇందుకు అంకురార్పణగా.. గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించిన మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2న రాష్ట్రంలోని ప్రతి మండలంలో.. కనీసం ఒక గ్రామంలో సచివాలయ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇందులో ఇంటర్నెట్‌తో కూడిన కంప్యూటర్లు, తదితర అన్ని మౌలిక వసతులను కల్పిస్తారు. కార్యక్రమ నిర్వహణపై పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. సంబంధిత ఎమ్మెల్యేలను తప్పకుండా ఆహ్వానించాలని, ప్రొటోకాల్‌ నియమ నిబంధనలను అనుసరించి ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని సూచించారు. కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లందరూ సంబంధిత మండలంలోని ఒక గ్రామంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలన్నారు.

కాకినాడ రూరల్‌లో సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి ప్రారంభించి, ఆ సందర్భంగా చేయనున్న ప్రసంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల వీక్షించేలా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసుకోవాలని గిరిజా శంకర్‌ సూచించారు. సీఎం సందేశాన్ని మండలాల ఈవోపీఆర్డీలు అక్కడి ప్రజలకు చదివి వినిపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన, ఇప్పటికే అమలు పరుస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలందరూ తెలుసుకునేలా నిర్వహణ ప్రదేశాల్లో బ్యానర్లు, కళాజాతాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లను కోరారు.

విశాఖ, విజయనగరంలో పురపాలక మంత్రి…: విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గంలోని గంట్యాడ మండలం నరవల్లో ఈ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించనున్నారు. అలాగే, మధ్యాహ్నం విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో,ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థల్లో 3786 వార్డు సచివాలయాలు ఏర్పాటవనున్నాయి. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 12 మంది వార్డు కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల సేవలను అందజేయడంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరిస్తారు. వార్డు వలంటీర్లతో సమన్వయం చేసుకుంటారు.

బాపూ ఆదర్శాలే స్ఫూర్తిగా: జగన్‌
సత్యం, అహింస, శాంతి ఈ పదాలకు నిజమైన అర్థం బాపూజీ జీవితమని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా బాపూజీకి ఆయన ఘన నివాళి అర్పించారు. ఆ మహానీయుడి 150వ జయంతి వేళ.. ఆయన స్వప్నమైన గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా అక్టోబరు రెండో తేదీ నుంచి సాకారం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. భారతీయ ఆత్మ మన పల్లెల్లోనే ఉందన్న గాంధీజీ పలుకులే వేదాలుగా రైతులు, పేదల సంక్షేమానికి బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ‘నవరత్నాలు’ అమలు చేస్తున్నామన్నారు.

బాపూ జీవితం ఆదర్శం: చంద్రబాబు
‘అహింసా మార్గంలో భారతమాతకు బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగించిన మహనీయుడు మహాత్మాగాంధీ. అందుకే ఆయన జన్మదినాన్ని ఏటా అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 150వ జయంతి సందర్భంగా ఆయనను మననం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *