పారిస్ : రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి భారత దేశ రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ రికార్డు సృష్టించారు. ఫ్రాన్స్‌లోని బోర్డాక్స్ పట్టణానికి సమీపంలోని మెరినాక్ వద్ద డసాల్ట్ ఏవియేషన్ ప్రాంగణంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని ఆయన స్వీకరించారు. ఈ విమానానికి ఆయన శస్త్ర పూజ చేశారు. అనంతరం దానిలో ప్రయాణించారు. డసాల్ట్ ఏవియేషన్ హెడ్ టెస్ట్ పైలట్ ఫిలిప్ ఈ విమానానికి పైలట్‌గా వ్యవహరించారు.
యుద్ధ విమానంలో ప్రయాణం విజయవంతంగా ముగిసిన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ తన ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, హాయిగా సాగిందని చెప్పారు. ఇవి మునుపెన్నడూ లేనటువంటి క్షణాలని, యుద్ధ విమానంలో సూపర్‌సానిక్ స్పీడ్‌తో ప్రయాణించే రోజు ఒకటి వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదని చెప్పారు.
రఫేల్ యుద్ధ విమానాన్ని స్వీకరించిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్ శస్త్ర పూజ చేశారు. విమానంపై ‘ఓం’కారం రాశారు, కొబ్బరికాయను ఉంచి, పూలు వేశారు. విమానం టైర్ల క్రింద నిమ్మకాయలను ఉంచారు.