ఢిల్లీ: భారత యాత్రికులు పాక్‌లోని సిక్కు పవిత్ర క్షేత్రం గురుద్వారా సాహిబ్‌కు వెళ్లేందుకు వీలు కల్పించే కర్తార్‌పూర్ కారిడార్ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. గురువారం భారత అధికారులు పాక్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లి చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసిన విషయాన్ని పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ట్వీట్ చేశారు. తొలుత ఈ ఒప్పందాన్ని బుధవారమే పూర్తిచేయాలని భారత్ ప్రతిపాదించినా పాక్ అందుకు అంగీకరించలేదు. తమకు పాలనాపరమైన సమస్యలు ఉన్నందున గురువారం సంతకాల ప్రక్రియ పూర్తి చేయాలని కోరింది.
తాజాగా ఒప్పందం ముగిసిన నేపథ్యంలో కారిడార్‌ను ప్రారంభించడమే మిగిలి ఉంది. వచ్చే నెల 9న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ భూభాగంలో ఈ మార్గాన్ని ప్రారంభిస్తారని మహ్మద్ ఫైజల్ ట్వీట్లో పేర్కొన్నారు. భారత భూభాగంలో ఈ మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని గతంలో కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ ట్వీట్ చేశారు.
భారత్‌లోని గుర్దాస్పూర్ నుంచి పాక్‌లోని గురుద్వారా సాహిబ్ వరకూ ఈ కారిడార్ పొడవు సుమారు 6.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం నుంచి యాత్రికులు పాకిస్థాన్‌కు వీసా లేకుండా వెళ్లి గురుద్వారా సాహిబ్‌ను సులభంగా దర్శించుకోవచ్చు. ఈ మార్గాన్ని నిర్మించాలని భారత్-పాక్ మధ్య దశాబ్దాలుగా చర్చలు సాగాయి.