న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను విలీనం చేయాలని నిర్ణయించింది. వీటిని మూసేయడం కానీ, వదిలించుకోవడం కానీ చేయబోమని తెలిపింది. ఈ రెండు సంస్థలు పూర్తిగా విలీనమయ్యే వరకు బీఎస్ఎన్ఎల్ యూనిట్‌గా ఎంటీఎన్ఎల్ పని చేస్తుందని పేర్కొంది.
టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిపోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)లను విలీనం చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. వీటిని మూసేయడం కానీ, వదిలించుకోవడం కానీ జరగదన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికాం సంస్థల పునరుజ్జీవం కోసం ఎంటీఎన్ఎల్ను బీఎస్ఎన్ఎల్తో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండూ సంపూర్ణంగా విలీనమయ్యే వరకు బీఎస్ఎన్ఎల్ యూనిట్‌గా ఎంటీఎన్ఎల్ పని చేస్తుందన్నారు.
ఈ రెండు కంపెనీలు మరింత పోటీ తత్వంతో పని చేసేవిధంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సావరిన్ బాండ్ల ద్వారా రూ.15 వేల కోట్లు సేకరించాలని అనుకుంటున్నామని చెప్పారు.
రూ.38 వేల కోట్ల విలువైన వీటి ఆస్తులను నాలుగేళ్ళలో ద్రవ్యరూపంలోకి మార్చుతామన్నారు. ఈ కంపెనీల ఉద్యోగులకు ఆకర్షణీయమైన వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు.