దుబాయి: టెస్టుల్లో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోవడానికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకే ఒక్క పాయింట్ దూరంలో ఉన్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి 936 పాయింట్లతో మొదటి స్థానానికి చేరువయ్యాడు. తొలి స్థానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్ 937 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో వీరోచిత డబుల్ సెంచరీ సాధించిన కోహ్లి 37 పాయింట్లు సాధించాడు. సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మరో మ్యాచ్ మిగిలుండడంతో కోహ్లి టాప్ ర్యాంక్ చేరుకోవడం లాంఛనమే. యాషెస్ సిరీస్‌కు ముందు కోహ్లి అగ్రస్థానంలోనే ఉన్నాడు. కానీ, యాషెస్‌లో చెలరేగి ఆడిన స్మిత్, కోహ్లి నుంచి టాప్ ర్యాంక్‌ను లాక్కున్నాడు. మూడో స్థానంలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 878 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, భారత బ్యాట్స్‌మెన్ పుజారా, న్యూజీలాండ్ ఆటగాడు హెన్రీ నికోల్స్ 4, 5 స్థానాల్లో ఉన్నారు. భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేల్లో కోహ్లి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
