Breaking News
Home / National / పోలీసు కుటుంబాన్ని పరామర్శించిన అమిత్ షా…

పోలీసు కుటుంబాన్ని పరామర్శించిన అమిత్ షా…

శ్రీనగర్: రెండు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోమంత్రి అమిత్‌షా… ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఓ పోలీసు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నెల 12న అనంతనాగ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఇన్‌స్పెక్టర్ అర్షద్ అహ్మద్ ఖాన్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీనగర్‌లోని బాల్‌గార్డెన్ వెళ్లిన అమిత్ షా… బాధిత కుటుంబాన్ని సందర్శించి వారికి ధైర్యం చెప్పారు. అహ్మద్ ఖాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓ కుమారుడి వయసు నాలుగేళ్లు కాగా, మరో కుమారుడికి ఏడాది. పెట్రోలింగ్ చేస్తున్న పారామిలటరీ దళాలపై ఓ జైషే మహ్మద్ ఉగ్రవాది కాల్పులు జరపడంతో ఐదురుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఖాన్‌ను హెలికాప్టర్ ద్వారా ఢిల్లీ తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు.

కాగా అమిత్ షా ఇక్కడికి వస్తున్న సందర్భంగా పోలీసులు నగరంలోని అణువణువూ తనిఖీ చేశారు. అహ్మద్  ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మలిక్, డీజీపీ దిల్‌బాగ్ సింగ్, సీఎస్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రన్‌బీర్‌ సింగ్ సహా పలు నిఘా సంస్థల అధిపతులతో అమిత్ షా సమీక్ష జరిపారు. కేంద్ర హోమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా చేపట్టిన తొలి రాష్ట్ర పర్యటన ఇదే కావడం గమనార్హం. జమ్మూ కశ్మీర్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా దీన్ని భావిస్తున్నారు.

Check Also

ఢిల్లీ మాజీ సిఎం అంత్యక్రియల ఖర్చు ఎంతో తెలుసా?

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం నిగంబాధ్‌ ఘాట్‌లో జరిగాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *