రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజల్ గ్రామ వీఆర్వో శంకర్ గత కొన్ని రోజులుగా అవినీతికి పాల్పడుతున్నాడు. ఇటీవల గుర్రంగూడకు చెందిన ముత్యంరెడ్డి అనే రైతు తనకు చెందిన ఎకరం ఇరవై(1.20) భూమి మ్యూటేషన్ కోసం వీఆర్వో శంకర్‌ను కలవగా.. అతడు రైతును లక్ష రూపాయలు లంచం అడిగాడు. డబ్బిస్తేనే పనవుతుందని రైతుకు నిర్మొహమాటంగా తెలిపాడు. వీఆర్వోకు లక్ష రూపాయలు ఇవ్వలేననీ, 70 వేల రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు. తదనంతరం, రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం రైతు ముత్యం రెడ్డి వీఆర్వోకు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వీఆర్వో కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతికి పాల్పడ్డ వీఆర్వోను ఏసీబీ అధికారులు కోర్టుకు తరలించారు. ఏ స్థాయి అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే తమను ఆశ్రయించాలని ఏసీబీ డీఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 9440446140 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.
