Breaking News
Home / Lifestyle / Business / బంగారం కొనాలనుకుంటున్నారా..?

బంగారం కొనాలనుకుంటున్నారా..?

అక్షయ తృతీయకు ఆఫర్లు

హైదరాబాద్‌ సిటీ: అక్షయ తృతీయ వస్తోంది. బంగారం వర్తకులు విపరీతమైన ఆఫర్లనూ ప్రకటించారు. మేకింగ్‌ చార్జీలపై 25శాతం రాయితీని ఒకరందిస్తే.. ఇప్పుడు బుక్‌ చేసుకోండి.. తక్కువ బంగారం ధర చెల్లించండి అంటూ మరొకరు… ఇలా వినూత్నమైన ఆఫర్లను అందిస్తున్నారు. షాపుల్లో బంగారం మాత్రమే కాదు.. విభిన్న రూపాలలోనూ ఈ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అదెలా అంటే గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌), సోవరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ)ల్లాంటివి. గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు కూడా కొనుక్కోవచ్చు. ఏ పథకం ఎలా ప్రయోజనం అందిస్తుందంటే…

షాపుల్లో కొనుగోలు..
అందరికీ తెలిసిన మార్గమిది. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లో సైతం బంగారాన్ని కొనుగోలు చేయడం పెరిగింది. కానీ, బంగారాన్ని ప్రత్యక్షంగా చూడకుండా కొనుగోలు చేయడానికి ఇప్పటికీ చాలామంది ఆలోచిస్తున్నారనేది వాస్తవం. ఆభరణాలను కొనుగోలు చేయడంలో ఉన్న అతి ప్రధానమైన ఇబ్బంది తరుగు, మజూరి. షాపు, డిజైన్‌ బట్టి ఇది మారిపోతుంటుంది. బంగారం కొనడంలోని ఆనందం కన్నా ఈ వాల్యూ ఎడిషన్‌ (వీఏ) లేదంటే మేకింగ్‌ చార్జీలకైన ఖర్చు చూసి బాధపడే వారే ఎక్కువ. ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం, గోల్డ్‌ స్కీమ్స్‌లో పాల్గొనడం, వీటివల్ల ప్రతినెలా కొంత మొత్తం చెల్లించి, ఆ మొత్తానికి వీఏ రాయితీ పొందొచ్చు.

ఆభరణాలొద్దు, కాయిన్స్‌ కొనుక్కుంటే తర్వాత నచ్చినప్పుడు ఆభరణాలు చేయించుకోవచ్చు అనుకునే వారికి ఆ చాన్స్‌ లేకుండా చాలా వరకూ షాప్‌లు మేకింగ్‌ చార్జీలను బాదుతున్నాయి. అలా కాదనుకుంటే బ్యాంకులలో కొనుగోలు చేయవచ్చు. ఇక ఎంఎంటీసీ లాంటి సంస్థలు ఈ కాయిన్స్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నాయి. మార్కెట్‌ ధరతో పోలిస్తే కొంత తక్కువలో ఇవి లభ్యమయ్యే అవకాశాలున్నాయి.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ :
ఆర్‌బీఐ విడుదల చేసే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌కు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతుంది. సాధారణంగా ఆర్‌బీఐ సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ అమ్మకానికి పెట్టిన తేదీలకు ముందున్న బంగారం ధరనే బాండ్‌ ధరగా నిర్ణయిస్తుంటారు. ఫిబ్రవరి 2019 వరకూ విక్రయాలను జరిపారు కానీ ప్రస్తుతానికి వీటి విక్రయాలు లేవు. ఈ బాండ్స్‌లో ఉన్న ప్రధాన ప్రయోజనం క్యాపిటల్‌ గెయిన్‌ పన్ను మినహాయింపు. మరోటి ఈ బాండ్స్‌పై దాదాపు 3శాతం వరకూ వడ్డీ పొందే అవకాశం ఉండటం. ప్రభుత్వం ఈ బాండ్స్‌ విడుదల చేసినప్పుడు కొనుగోలు చేసుకోవడం వల్ల కొంత ప్రయోజనం పొందవచ్చు.

గోల్డ్‌ ఈటీఎఫ్‌ :
భౌతికంగా బంగారం లేకుండా పేపర్ల మీదనే బంగారం ఉందనడానికి ఉన్న మరో అవకాశం గోల్డ్‌ ఈటీఎఫ్‌. సాధారణంగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ అయిన పలు గోల్డ్‌ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు. కాకపోతే స్టాక్‌మార్కెట్‌లో ఉండే రిస్క్స్‌ ఇక్కడ కూడా ఉంటాయి. ఇంకో ప్రమాదమేమిటంటే ఈ తరహా గోల్డ్‌ ఈటీఎఫ్‌లపై మూడేళ్ల తరువాత 20శాతం పన్ను కూడా చెల్లించాల్సి రావొచ్చు.ఈ మూడింటిలోనూ ఏది మేలంటే వ్యక్తుల అవసరాలు, పెట్టుబడులను బట్టి మారుతుంటుందనే చెప్పాలి. కాకపోతే ఎన్నటికీ తరుగని అనే అర్ధాన్ని కలిగిన అక్షయ లాగానే, పసిడిని తమకన్నా ఎక్కువగా ప్రేమించే భారతీయులున్నంత కాలం బంగారానికి విలువ ఎన్నటికీ తరగదు !

Check Also

కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం

Share this on WhatsAppఅమరావతి: కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *