అడిలైడ్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ మరోసారి అభిమానుల మనసులు గెలిచాడు. ఆదివారం శ్రీలంకతో తలపడిన మ్యాచ్‌లో వార్నర్(100*) అద్భుత శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టుపై ఆసీస్ 134 పరుగుల భారీ తేడాతో గెలుపొందగా మ్యాచ్‌కు ముందు వార్నర్ ఓ కుర్ర అభిమానిని ఆశ్చర్యపర్చాడు. స్టేడియంలో ప్రాక్టీస్ చేసి తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తున్న సమయంలో ఆసీస్ ఓపెనర్ ఓ బాలుడికి తన గ్లోవ్స్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ బాలుడి ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది. వార్నర్ ఇచ్చిన గ్లోవ్స్‌ను చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్.కామ్ అనే వెబ్సైట్ ట్విటర్లో పోస్టు చేసింది. అయితే, వార్నర్ గత వన్డే ప్రపంచకప్‌లోనూ ఇలాగే ఓ చిన్నారిని ఆశ్చర్యపర్చాడు.
