Breaking News
Home / National / మనకు శ్రతువులు లేరు: ప్రణబ్ ముఖర్జీ ఉద్వేగ ప్రసంగం

మనకు శ్రతువులు లేరు: ప్రణబ్ ముఖర్జీ ఉద్వేగ ప్రసంగం

గుహవాటి: ఒక భాష, ఒక మతం, ఒక ప్రాంతం, ఒక శత్రువు అనే భావనలో భారత జాతీయత లేదని, భారత ఆత్మ బహుళమైందని, విశ్వవ్యాపితమైందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అస్సాంలోని గుహవాటిలో ఉన్న నార్త్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పిల్లాడు కానీ ఒక మహిళ కానీ దాడికి గురైనప్పుడు భారత ఆత్మ గాయపడుతుందని అన్నారు. ఈ దేశ సౌందర్యం బహుళత్వమని ఏ ఒక్క భావజాలానికో దానిని అంటగట్టవద్దని సూచించారు. ‘భారత సమాజంలో సహనం’ అనే అంశంపై ఆయన ఉద్వేగంతో ప్రసంగించారు.

‘‘ఈరోజు నేను గమనించిందేంటంటే.. మన మధ్య ఉన్న విభిన్నత్వాల సంఘర్షణల వల్ల హింస పెరుగుతోంది. పర్యవసానంగా సామరస్యంతో కూడిన జీవన విధానాన్ని మనం కోల్పోతున్నాం. ఈ హింస కేవలం భౌతికపరంగానే కాకుండా మానసిక, మేధోపరమైన, సామాజిక, ఆర్థిక విధ్వంసాలను సృష్టిస్తుంది. తోటి మానవుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాయి. అవిశ్వాసం, ధ్వేషం పెరిగిపోతున్నాయి. అనుమానం, అసూయలు కూడా ఉన్నాయి’’ అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

ప్రజాస్వామ్యంలో సమాచారం, సహేతుకమైన బహిరంగ చర్చలు చాలా ముఖ్యం. రెండు వ్యతిరేక భావాలను సమతుల్యం చేయాలి. వాటిని మరింత పటిష్ట పర్చాలి. హింస, భౌతిక దాడుల నుంచి ప్రజా గొతుకను విడిపించాలి. అహింసాత్మక సమాజం మాత్రమే ప్రజాస్వామ్య ప్రక్రియలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించగలదు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారు, నాగరిక సమాజానికి దూరంగా ఉన్నవారిని భాగస్వామ్యం చేయాలి. కోపం, హింస నుంచి శాంతి, సామరస్యం వైపుగా ఆనంద తీరాలకు మనం చేరుకోవాలి” అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

ఇక ‘ఒకే దేశం.. ఒకే భాష’ అన్న అమిత్ షా వ్యాఖ్యలను ప్రణబ్ పరోక్షంగా వ్యతిరేకించారు. ‘‘భాతరదేశం యొక్క ఆత్మ ఒక భాష, ఒక మతం, ఒక శత్రువులో ఇమడలేదు. అది బహుళమైంది. 130 కోట్ల మందికి అనువైన శాశ్వత విశ్వవ్యాపితవాదం మనది. దైనందిన జీవితంలో 122 భాషలు, 1600 మాండలికాలు మాట్లాడుతున్నాం. మన జీవన విధానంలో ఏడు ప్రధాన మతాలు ఉన్నాయి. కాకాసియన్లు, మంగోలాయిడ్లు, ద్రావిడలు ఒకే వ్యవస్థలో నివసిస్తున్నారు. మనకు ఒక జెండా ఉన్నట్లుగానే ఒక జాతీయత ఉంది. అదే ‘ఇండియన్’ లేదా ‘భారతీయత’. మనకు శత్రువులు ఎవరూ లేదు. ఈ భిన్నత్వమే దేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది’’ అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *