ప్రపంచదేశాలు పటిష్టమైన నిర్ణయాలు తీసుకోలేని పక్షంలో.. కరోనా మహమ్మారి అత్యంత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చాలా వరకు ప్రపంచ దేశాలు వైరస్‌ను ఎదుర్కొనే అంశంలో తప్పుడు విధానాలు అవలంభిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ తెలిపారు. అనుసరించాల్సిన చర్యలను అమలు చేయకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నట్లు ఆయన తెలిపారు. జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ.. దేశాధినేతల నుంచి వస్తున్న మిశ్రమ సందేశాల వల్ల మహమ్మారి నియంత్రణలో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లినట్లు టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. వైరస్ ఇంకా ప్రజలకు నెంబర్ వన్ శత్రువుగానే ఉన్నదని, కానీ కొన్ని ప్రభుత్వాల, ప్రజల చర్యలు ఆ స్థాయిలో లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక దూరాన్ని పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్క్‌లను ధరించడం లాంటి అంశాలను ప్రజలు, ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలని డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. ఇలా చేయకపోతే ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదు అని ఆయన హెచ్చరించారు. ప్రాథమిక సూత్రాలను పాటించుకుంటే, అప్పుడు మహమ్మారి ఎక్కడికీ వెళ్లదు అని, అది మరింత అధ్వాన్నమైన పరిస్థితులకు దారి తీస్తుందని ఆయన అన్నారు.
