Breaking News
Home / States / Andhra Pradesh / సత్తెనపల్లిపై టీడీపీలో ఎందుకింత రచ్చ..?

సత్తెనపల్లిపై టీడీపీలో ఎందుకింత రచ్చ..?

సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీలో సత్తెనపల్లి నియోజకవర్గం అభ్యర్థి విషయంలో చిచ్చు రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద రావు మళ్లీ సత్తెనపల్లి నుంచి తానే అభ్యర్థినని ఇప్పటికే ప్రకటించుకున్నారు. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే.. ఇదే సీటును నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తన కుమారుడికి ఇవ్వాలని అధిష్టానానికి ప్రతిపాదన పంపారు. ఇవ్వని పక్షంలో ఆయన పార్టీ మారతారని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే.. రాయపాటి ప్రతిపాదనపై కోడెల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న స్థానాన్ని కేటాయించమని ఎలా అడుగుతారని ఆయన రాయపాటిని సూటిగా ప్రశ్నించారు.

కోడెల సత్తెనపల్లి విషయంలో ఇంతలా పట్టుబట్టడానికి కారణం లేకపోలేదు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ ఐదేళ్ల కాలంలో కోడెల పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సత్తెనపల్లి పట్టణం కూడా కోడెల హయాంలో సుందరీకరించబడింది. అత్యాధునిక సొబగులతో పోలీస్ స్టేషన్, ప్రభుత్వాస్పత్రి నూతనీకరణ, రైల్వే స్టేషన్ రోడ్‌లో ఉన్న చెరువును ఎన్టీఆర్ లేక్‌గా మార్చి కోడెల తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో ఇచ్చిన పిలుపునకు సత్తెనపల్లి నియోజకవర్గంలో వచ్చిన స్పందన అంతాఇంతా కాదు.

కోడెల ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. 20వేలకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం నియోజకవర్గంలో జరిగింది. స్వర్గపురి కార్యక్రమంలో భాగంగా శ్మశానవాటికల నిర్మాణం జరిగింది. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు తన హయాంలోనే జరిగాయని, మళ్లీ తనకే ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తారనేది కోడెల వాదన. రాయపాటి మాత్రం తన కుమారుడికి సీటు ఇవ్వాల్సిందేనని అలకబూనినట్లు సమాచారం. అధిష్టానం ప్రత్యేక దృష్టి పెడితే తప్ప సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థిపై నెలకొన్న వివాదం సద్దుమణిగేలా లేదు.

Check Also

ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

Share this on WhatsAppహైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన 3లక్షల 25 వేల మంది విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *