Breaking News
Home / States / Andhra Pradesh / పెరుగుతున్న భార్యాబాధితులు.. పురుష కమిషన్‌ ఏర్పాటుకై ఢిల్లీలో ధర్నా

పెరుగుతున్న భార్యాబాధితులు.. పురుష కమిషన్‌ ఏర్పాటుకై ఢిల్లీలో ధర్నా

ఇంటి పోరు ‘ఇంతింత’ కాదయా
ఏపీ వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఏర్పాటు
సోషల్‌ మీడియాలో విస్తృత మద్దతు

గుంటూరు: భర్తను భార్య అప్పడాల కర్రతో దండించడం.. కేవలం కార్టూన్లలో చూస్తుంటాం. వాస్తవంగా ఇటువంటివి జరగవు కూడా..! కానీ సమాజంలో భార్యా బాధితులు కూడా ఉన్నారు.. వారు తమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు.. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇది నిజం. సమాజంలో నైతిక మద్దతు కూడా కూడగట్టుకునేందుకు బాధితులందరూ కలిపి ఇటీవల సంఘాలుగా ఏర్పడుతున్నారు. ఈ దేశంలో తాము పౌరులమేనని, తమకు హక్కులు కావాలంటూ నిలదీస్తున్నారు. ఇటువంటి సంఘాలు మన రాష్ట్రంలోనే పదుల సంఖ్యలో ప్రతి జిల్లాలో వెలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎస్‌ఐఎఫ్‌ పేరుతో పదివేల మందితో వీరికి సలహాలు, సహాయాలు అందించేందుకు బ్రాంచ్‌లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఈనెల 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలను కూడగట్టి సుమారు పదివేల మందితో రెండు రోజుల పాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్త్రీ కమిషన్‌ కాకుండా పురుష కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రధానంగా వీరు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు హరిహరన్‌, అన్షుత్‌వర్మలు వచ్చి మద్దతు తెలపడం కొసమెరుపు.

స్త్రీకి అన్యాయం జరిగిందంటే రాజకీయ నేతలు, పోలీసులు, మహిళా సంఘాలు అందరూ స్త్రీ వైపే అండగా నిలుస్తారు. కానీ పురుషుడికి అన్యాయం జరిగిందంటే.. అసలు ఆ మాట చెప్పుకోవడానికే అవమానంగా భావిస్తారు. భార్య తనను బెదిరిస్తోందని ఎక్కడచెప్పినా.. అదో రకమైన చిన్నచూపు. బంధుమిత్రుల్లో సైతం సానుభూతి లేకపోగా వెటకారపు మాటలు ఎదుర్కొంటున్నామని భార్యాబాధితులు చెబుతున్నారు.

సోషల్‌ మీడియాలో మద్దతు…
భార్యాభాధితుల సంఘాలు సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తున్నారు. దీనికి రాష్ట్రవ్యా ప్తంగా అనేక సంఘాలు ఏర్పాటు కావడంతో అందరూ కలిసి సోషల్‌ మీడియాను వేదికగా చేసుకున్నారు. వీరికి లభిస్తున్న మద్దతు ఈ సంఘాలకు దానిలోని సభ్యులకు మద్దతుగా ఉంటుంది. దీంతో వారంతా తమ బాధలను చెప్పుకుంటూ మానసిక ప్రశాంతత పొందుతున్నారు. ఈ సంఘాల ఏర్పాటు ఏ స్థాయికి వెళ్ళిదంటే మండలాలు, జిల్లాల వారీగానే కాకుండా హైదరాబాద్‌ కేంద్రంగా సాఫ్ట్‌వేర్‌ భార్యాబాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఇటీవల దాని ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. 300 మంది సమావేశానికి హాజరయ్యారు.

బాధిత సంఘాల రాష్ట్ర సమావేశం
ఈనెల 1వ తేదీన విజయవాడలో ఏపీ భార్యా బాధితుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వందల సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు. తామంతా సంఘటితంగా పోరాడి పురుషుల హక్కులు సాధించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సమావేశంలో ప్రధానంగా వారుఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.

  • 498 ఎ సెక్షన్‌ను పునఃసమీక్షించాలి. దీని ప్రకారం కేసు నమోదు చేసే ముందే పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా అరెస్టులకు వెళ్ళకూడదు. విచారణను ఎమ్మార్వో లేదా ఆర్డీవోల సమక్షంలో నిర్వహించాలి. కేసు నమోదు అయినా ఏడాది లోపు విడాకులు మంజూరు చేసేలా చట్టం తేవాలి.
  • ఎంసీ, డీవీసీ సెక్షన్లను పూర్తిగా చట్టంలో నుంచి తొలగించి, కోర్టులో ఉన్న పెండింగ్‌లో ఉన్న కేసులపై మరలా కేసులు పెట్టకుండా చూడాలి.
  • స్త్రీ కమిషన్‌ ఏర్పాటు చేసినట్లే పురుష కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాలి.
  • పుట్టిన పిల్లలను భర్త అంగీకరిస్తే విడాకుల తరువాత అతనికే అప్పజెప్పాలి.
  • బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకునే ఉద్యోగిపై ఆయన భార్య 59 కేసులు పెట్టింది. చివరకు విసుగుపుట్టి తను ఉన్నత న్యాయస్థానానికి వెళితే తీవ్ర స్థాయిలో మందలించి ఇకపై విచారణలో ఉండగా కొత్త కేసులు నమోదు చేయ వద్దంటూ ఆదేశించింది.
    భార్యాబాధితుల సంఘానికి అనూహ్యంగా మహిళల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. కోడళ్ళ కారణంగా బాధితులుగా మారుతున్న అత్తలు, తోడి కోడళ్ళు, ఆడపడుచులు దీనిలో సభ్యులు గా చేరుతున్నారు. ఈనెల 2, 3 తేదీల్లో ఢిల్లీ జరిగిన ధర్నాలో కూడా ఎక్కువమంది మహిళలు పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం దీనికి నిదర్శనం.ఈ సంఘాల్లో చేరుతున్న వారిలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులే ఉంటున్నారు. వారిలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతస్థాయి డాక్టర్లు, నాయకులు, మంత్రులు ఉన్నారు. వీరు ఇటీవల ఢిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.

Check Also

ఆయన ప్రభుత్వం చీకటి ఆలోచనలు చేస్తోంది….

Share this on WhatsAppగుంటూరు: రాష్ట్రంలో మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సిగ్గు చేటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *