అమరావతి: కోడెల విగ్రహ ఏర్పాటుకు అనుమతివ్వకపోవడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. ఎవరి అనుమతితో వేలాది వైఎస్ విగ్రహాలు వెలిశాయని ప్రశ్నించారు. ఆత్మత్యాగం తర్వాత కూడా కోడెలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఫ్యాక్షన్ రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. కోడెల విగ్రహ ఏర్పాటు కోసం కలెక్టర్‌ను అనమతి కోరుతూ.. పది రోజుల క్రితమే దరఖాస్తు చేశామన్నారు. నిబంధనలకు అనుగుణంగానే విగ్రహ నిర్మాణం చేపట్టామన్నారు.
అనుమతి లేదంటూ విగ్రహ దిమ్మెను అధికారులు కూలగొట్టడం ఏ విధంగా సమంజసమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వేలాది వైఎస్ విగ్రహాలను ప్రస్తుత సీఎం జగన్ గతంలో ఆవిష్కరించారని.. వాటిని ఎందుకు కూల్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల విషయంలో ప్రభుత్వం ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని వెంకట్రావు హితవు పలికారు.