Breaking News
Home / National / ఆకతాయికి బుద్ధి చెప్పిన మహిళా పోలీసు : వీడియో వైరల్

ఆకతాయికి బుద్ధి చెప్పిన మహిళా పోలీసు : వీడియో వైరల్

పాఠశాల బాలికలను వేధిస్తున్న ఆకతాయికి బూటు దెబ్బలతో బుద్ధి చెప్పిన మహిళా పోలీసు

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): పాఠశాలకు వెళుతున్న బాలికలను వేధిస్తున్న ఓ ఆకతాయికి మహిళా పోలీసుకానిస్టేబుల్ బూటు దెబ్బలతో బుద్ధి చెప్పిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలోని బితూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. బితూర్ ప్రాంతంలోని ఓ పాఠశాలకు బాలికలు వెళుతుండగా ప్రతీరోజూ కొందరు ఆకతాయి యువకులు వెంటపడి వేధిస్తున్నారని యాంటీ రోమియో స్క్వాడ్‌కు సమాచారం అందింది. దీంతో యాంటీ రోమియో స్క్వాడ్‌‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ పాఠశాల వద్ద కాపు కాసింది. అంతలో ఓ యువకుడు బాలికల వెంట పడి వేధిస్తున్నాడు. దీన్ని చూసిన మహిళా కానిస్టేబుల్ ఆగ్రహంగా తన బూటు తీసి దాంతో ఆకతాయిని ఎడాపెడా కొట్టి బుద్ధి చెప్పింది. ‘‘నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు ఇంట్లో తల్లీ, చెల్లెళ్లు లేరా?’’ అంటూ మహిళా పోలీసు కానిస్టేబుల్ తన బూటుతో కొట్టి ఆకతాయికి బుద్ధి చెప్పింది. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్తా వైరల్ గా మారింది. బాలికలను వేధించిన ఆకతాయిపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశామని కాన్పూర్ జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ చెప్పారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *