కాకినాడ: బోటు ప్రమాదం విషయంలో టీడీపీ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తోందని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశం నలుమూలల నుండి వచ్చిన నిపుణులంతా బోటు వెలికితీత సాధ్యం కాదని తేల్చి చెప్పారన్నారు. రెండు గంటల్లో బోటును బయటకు తీస్తామని మీడియా ముందు ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు కనిపించడం లేదని చెప్పారు. ఇప్పటికైనా సరే ఎవరైనా బోటు వెలికి తీస్తామంటే అన్నివిధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
పడవ ప్రమాదం జరిగితే జగన్ ఏరియల్ సర్వే చేయడం ఏంటని టీడీపీ నేతలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏరియల్ సర్వే చేయకపోతే నీటి మీద నడిచివెళ్లి చూడాలా?, పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ కోసం 29 మంది తొక్కిసలాటలో చనిపోతే ఏ ఒక్కరి మీద చర్య ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పడవ ప్రమాదాల తర్వాత సరైన నిబంధనలు రూపొందించి ఉంటే కచ్చులూరు పడవ ప్రమాదం జరిగేది కాదని పేర్కొన్నారు. చనిపోయిన వారికి, గల్లంతైన వారికి కూడా డెత్ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. ప్రాణాలతో బయట పడ్డవారికి, గాయపడినవారికీ కూడా నష్ట పరిహారం చెల్లించామన్నారు.