Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / వైసీపీ ఎంపీ వర్సెస్ కమిషనర్

వైసీపీ ఎంపీ వర్సెస్ కమిషనర్

అనంతపురం : నగర కమిషనర్‌ ప్రశాంతి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ప్రస్తుతం ఇది అందరినోటా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది? ఏం జరగబోతోంది? ఉన్నఫలంగా ఆమె దీర్ఘకాలిక సెలవులో ఎందుకు వెళ్లారు? ఆమె తిరిగి కమిషనర్‌గా వస్తారా? లేక ఆమె స్థానంలో మరొకరు వస్తారా? అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్నలివి. కమిషనర్‌గా వచ్చిన అనతికాలంలోనే ఆమె తనదైన మార్కు చూపించారు. బోగస్‌ పింఛన్ల పేరుతో సొమ్ము స్వాహా చేసిన వారిని సస్పెండ్‌ చేయడంతో పాటు ప్రైవేటు వ్యక్తులను తొలగించారు.

కొంతవరకు అవినీతి తగ్గించే ప్రయత్నం చేశారు. ఇలాంటి అధికారి ఒక్కసారిగా సెలవులోకి వెళ్లడం అయోమయానికి గురిచేసింది. వ్యక్తిగత కారణాల వల్లే ఆమె సెలవులో వెళ్లినట్లు కార్పొరేషన్‌ వర్గాలు చెబుతున్నప్పటికీ.. వెనుక మాత్రం రాజకీయ ఒత్తిళ్లే ఆమె సెలవులోకి వెళ్లేలా చేశాయని సమాచారం. కుటుంబసభ్యుల అనారోగ్యం రీత్యా ఆమె సెలవులోకి వెళ్లినట్లు చెబుతున్నారు.

అదే కారణమైతే ఐఏఎస్‌ హోదాతో పాటు ఎన్నో సమస్యలున్న నగరపాలక సంస్థకు కమిషనర్‌గా ఉన్న ఆమె అన్ని రోజులు సెలవులో వెళ్లగలరా? కుటుంబసభ్యుల అనారోగ్యం మాటయితే వాస్తవమే. బెంగళూరులో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఎక్కడున్నా కార్పొరేషన్‌ సమస్యలపై దృష్టి సారించే కమిషనర్‌ రెండు, మూడురోజులకోసారి అక్కడికి(బెంగళూరు) వెళ్లి రావడం పెద్ద సమస్య కాదు. ఇలా ఇప్పటికే రెండు, మూడు నెలలుగా సెలవురోజుల్లో ఆమె అక్కడికి వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. కానీ, ఇప్పుడిలా అర్ధంతరంగా ఆమె దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లడం మాత్రం వివాదానికి దారి తీస్తోంది.

గత నెలాఖరులో తమ సమీప బంధువు మృతి చెందిన విషయం తెలుసుకున్న నగర కమిషనర్‌ ప్రశాంతి ఇక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ఈ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ఫైల్‌పై ఆమె సంతకం చేయాల్సి ఉంది. అంతటి దుఃఖంలోనూ ఆమె మరుసటిరోజు ఉదయం 10 గంటలకు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉన్నారు. విధుల్లో కచ్చితత్వం పాటించడంతో పాటు పరిపాలనలోనూ ఆమె అంతే నిజాయితీగా వ్యవహరిస్తారనే పేరుంది.

అక్రమ కట్టడాల తొలగింపే కారణమా..?
కమిషనర్‌ ప్రశాంతి సెలవులో వెళ్లడానికి అక్రమ కట్టడాల కూల్చివేతే కారణమా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈనెల 13వ తేదీ కలెక్టరేట్‌ సమీపంలోని సెరికల్చర్‌ కార్యాలయం ఎదురుగా గల అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి నగరపాలకసంస్థ అధికారులు ఉపక్రమించారు. కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న ఈ అక్రమ కట్టడాలపై హైకోర్టు నుంచి అప్పటికే నోటీసులందాయి. అదే విషయంలో ఉన్నతాధికారులకు కంటెంప్ట్‌ నోటీసు కూడా అందింది.

దీంతో అక్రమకట్టడాల కూల్చివేతకు సిద్ధమయ్యారు. పోలీసు బందోబస్తు సహాయంతో భవనాలు కూల్చివేస్తున్న సమయంలో అనంతపురం ఎంపీ రంగయ్య అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కమిషనర్‌గా పనిచేశానని.. ఏది ఎప్పుడు చేస్తారో తనకు తెలియదా..? అంటూ అసహనం వ్యక్తం చేశారు. అక్కడున్న ఏసీపీ సుబ్బారావుతో మాట్లాడారు. కోర్టు ఆదేశాల మేరకు తొలగిస్తున్నామని ఆయన చెప్పడంతో.. ప్రజాప్రతినిధులమైన తమకు చెప్పకుండా ఎలా తొలగిస్తారంటూ మండిపడ్డారు. అనంతరం ఉన్నతాధికారులతోనే మాట్లాడతానం టూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఉన్నతాధికారులపైనా..
అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతపురం ఎంపీ రంగయ్య జిల్లా ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినంత మాత్రాన ప్రజాప్రతినిధులమైన తమకు చెప్పకుండా ఎలా తొలగిస్తారంటూ మండిపడినట్లు సమాచారం. ఆ ఇద్దరు అధికారులనుద్దేశించి ..‘జిల్లా అంతా మీరే హవా కొనసాగిస్తారా?’ అనే భావం వచ్చేలా మాట్లాడినట్లు తెలిసింది. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారి ఆయనను శాంతపరిచే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

ఆయన ఆగ్రహం కారణంగానే తాత్కాలికంగా నాలుగు రోజుల పాటు కూల్చివేత పనులు నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారని ఆర్డీఓ వచ్చి చెప్పారు. దీంతో కూల్చివేతకు ముగింపు పలికారు. ఈ క్రమంలో కమిషనర్‌ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు చేస్తున్న పనిలోనూ ఇలాంటి ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలోనే దీర్ఘకాలిక సెలవులో ఆమె వెళ్లినట్లు తెలుస్తోంది. 13వ తేదీ కూల్చివేత జరగగా.. ఆ మరుసటి రోజే ఆమె మూడు రోజుల పాటు సెలవులో వెళ్లడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

ఎన్నడూ అన్ని రోజుల పాటు సెలవు తీసుకోని కమిషనర్‌ ఆ మూడు రోజులు సెలవు పెట్టడమే కొంత ఆశ్యర్యం కలిగించింది. ఆ తరువాత ఆ సెలవు మరో నెల రోజులు పొడిగించడంతో ఒత్తిళ్లే కారణమని స్పష్టమవుతోంది. కాగా, గతంలో అహుడా వైస్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో అప్పటి రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఏకంగా ఇక్కడి నుంచి కర్నూలుకు కమిషనర్‌గా ప్రశాంతిని బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *